top of page

 మా- గురువుగారు 

photo1_edited.png

సమర్థ సద్గురువులైన మహాత్మ శ్రీ రామచంద్రజి మహారారాజుగారు (బాబుజిగారు)
షాజహన్‌పూర్ (ఉ . ప్ర)

మా గురువుగారైన శ్రీ రామచంద్రజి మహారాజుగారు 1899 ఏప్రిల్ 30 ఆదివారం ఉదయం 7:26 గంటలకు (విక్రమ్ సంవత్ 1856, సాకా శకం 1821, బైశాఖి   బడి పంచమి సమయం 4-55) భారతదేశంలోని షాజహన్‌పూర్(ఉ.ప్ర)నందు జన్మించిరి.

 

భారతదేశపు ఉత్తరప్రదేశ రాష్ట్రములోని షాజహన్‌పూర్  నగరము ఆయన జన్మస్థలముకాగ  పరమపావనమయ్యింది. వారు హిందు కాయస్థ కుటుంబానికి చెందినవారయ్యుండి వారి కుటుంబమునకు ప్రఖ్యాతిగాంచిన మొఘల్ చక్రవర్తి కాలానికి చెందిన గొప్ప చారిత్రిక గతం వున్నది.

 

బాబుజి గారి గౌరవనీయులైన తండ్రిగారైన శ్రీ బద్రిప్రసాద్ 1867 జులై 12న బుడాన్లో జన్మించారు. ఆయన విధ్యాభ్యాసాన్ని ముగించిన తరువాత, 1892 లో షాజహన్‌పూర్ వద్ద న్యాయవాదిగా పనిని ప్రారంభించారు. త్వరలోనే ఆయన తన కాలపు ప్రముఖ న్యాయవాది అయ్యారు. పిదప గొప్ప ఖ్యాతిపొందారు మరియు ప్రత్యేక మేజిస్ట్రేట్ (1వ తరగతి ) గా  నియమించ బడ్డారు. ఆయన ఒక గొప్ప చారిత్రవేత్త. ఆయన పరిశోధన చేసి ఉర్దూలో సనాతన హిందు చరిత్రపై వ్రాసిన వ్యాఖ్యానము "ముష్రఫ్-ఉల్-తారిఖ్ హింద్ " లిపి రూపంలో వుండి, చాల అరుదైన విలువలను కూడియున్నది. అంతేకాక ఉర్ధులో వ్రాసిన శ్రీ కృష్ణ వంశపైని వ్యాఖ్య ఇంకా ప్రచురించ బడనిదై యున్నను చాల విలువైనది.

బాబుజి మహారాజుగారి తల్లి నిష్టావంతురాలు మరియు ఎల్లప్పుడూ దేవునికి అంకితమైయుండిరి. ఆమె బాబుజి గారి జీవితంలో ప్రతిదశలో నేర్పిన పాటం నిజాయితీగా ఉండండి. దొంగలించవద్దు. ఆమె శిక్షణ యొక్క ప్రభావం ఏమిటంటే ఇది బాబుజి గారి జీవితంలో ఒక భాగంగా మారింది.

చిన్నప్పటినుండి వారు పూజ (ఆరాధన) చేయటానికి మొగ్గు చూపేవారు మరియు తొమ్మిది సంవత్సరాల వయస్సు నుండి వారు సత్యవస్తువును  పొందుటకు తీరని తపననుభవించారు మరియు వారి స్థితి ఎలాగున్నిదంటే నీటిలో మునిగిన వ్యక్తి కి ఊపిరి ఆడకుండ ఏరీతి కలవరపడతారో ఆ విధంగా భగవంతుని పొందుటకుగాను తపన వున్నింది. అప్పుడు ఆయన భగవద్గీత చదవడం మొదలుపెట్టారు. కాని అది  వారు పరితపించే స్థితియొక్క అనుభూతినివ్వలేదు.

 

పద్నాలుగేళ్ళ వయస్సులో వారు ఎవరిదైనా చెమట వాసన ద్వారావారి గుణమును, నడతను తెలుసుకోగల విచిత్రమైన ప్రవృత్తిని పెంచుకున్నారు. పదిహేను లేదా పదహారేళ్ళ వయస్సులో వారు తత్వశాస్త్రం పై ఆసక్తి పెంచుకున్నారు మరియు "మిల్స్ యుటిలిటేరియనిజం" వంటి తాత్విక పుస్తకాలను చదివారు. తమ సత్యాన్వేషణను కొనసాగించడానికి అన్ని పుస్తకాలను ప్రక్కన పెట్టి తన సొంత ఆలోచనను పెంచుకున్నారు .

తన విధ్యాబ్యాస సమయంలో వారు మంచి హాకీ ఆటగాడు మరియు తరగతి జట్టుకునాయకుడు .ఉపాధ్యాయులు వారిని చాల ప్రేమించేవారు మరియు అవసరమైనప్పుడు వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగావుండేవారు. వారు తమ బాల్యంలో విషయాలను గూర్చి భవిష్యత్తును అంచనా వేసేవారు, అవి నిజమయ్యేది.

 

వారు తమ పంతొమ్మిదేళ్ళ వయసులో, మధురలో భగవతి అనే కన్యను వివాహం చేసుకున్నారు. కాని ఆవిడ 1949 చివరి భాగంలో మరణించారు .

 

వారు 1922 జూన్ 3 వ తేదీన తమ సమర్థ గురువులైన మహాత్మ శ్రీ రామచంద్రజి మహారాజు ఫథేగర్ (ఉ.ప్ర.), గారి పాదకమలములను స్పర్శించారు. బాబుజిగారు (S.S.L.C) పదవతరగతి మరియు మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణులయిన పిమ్మట హృదయ పూర్వకంగా ధ్యాన పద్దతిని ప్రారంభించారు. మరియు వారు అత్యంత భక్తి, ప్రేమలతో సాధన చేయసాగారు. వారికున్న అపారమైన విశ్వాసము మరియు గురువుగారిలో "లయావస్థ" పొందవలయునన్న దృఢమైన సంకల్పము, వారిని ఆథ్యాత్మికతయొక్క వివిధ దశలను దాటడానికి మరియు అనంత సముద్రములో ఈదుటకు వారి గురువుగారి కృపకు పా త్రులుగావించింది.

 

ఆగష్టు 15, 1931 ఉదయం వారు వారి అంతరంగంలోను మరియు బహిరంగలోను దివ్య శక్తిని అనుభవించారు. ఇదంతయు వారి గురువుగారిచే ఇవ్వబడిందని వారి అంతర్వాణి వారికి ఆశ్వాసన ఇచ్చింది. వారి గురువుగారు (లాలాజి  గారు ) 1931 ఆగష్టు 14 రాత్రి మహాసమాధిని పొందారు. బాబుజి  గారికి వారి  గురువుతప్ప వేరే దేవుడులేడు. వారు అన్ని ఇతర విషయాలతో    సంభంధం లేకుండా కేవలం గురువే అనే భావనతో ముందుకు సాగారు. వారి గురువుగారీ మర్త్యలోకాన్ని విడిచివెళ్ళేప్పుడు , బాబుజి  గారి కలలోవచ్చి ఈ క్రింది మాటలను వారి ప్రస్థుత స్థితిగా వివరించారు.

 

"నేను -నీవైతిని , నీవు -నేనైతిని . నేను -నీవుకాదని , నీవు -నేను కాదని ఎవ్వరు చెప్పగలరు?! ."

 

బాబుజి గారు తమ గురువుగారు ప్రవేశపెట్టిన రాజయోగ సాధన పద్దతిని మెరుగుపరిచి, దీనిని సహజమార్గమని   పేరుపెట్టారు. ఇప్పుడు ఈ సహజమార్గ  సాధన పద్ధతి యందు , సత్యవస్తువు యొక్క ప్రాప్తిపొందుటకు సులభమైన మరియు సహజమైన మార్గాన్ని  అనుసరించ బడుతుంది .

 

మానవుని సాధారణ జీవితంలో ఆచరించుటకు కష్టమైనటువంటి స్థూలమైన అపక్వ పద్దతులను సహజమార్గము పాటించమని సలహా ఇవ్వదు. సహజమార్గ ఆధ్యాత్మిక శిక్షణ పద్ధతిలో ఇంద్రియ కార్యకలాపములను సహజమైనరీతిలో నియంత్రించ బడుతుంది. తద్వారా సాధకులను (అభ్యాసులను) వారి నిజస్థితి (సత్యస్థితి) కి తీసుకురాబడుతుంది. అనగా, మొదటిసారిగా మానవ రూపాన్ని దాల్చినప్పుడు ఏస్థితియైతే  వుండినదో అట్టిస్థితి అంతేకాక యదేఛ్చగా పనిచేస్తున్న క్రింది ప్రవృత్తులు ఉన్నత ప్రజ్ఞ యొక్క ఆధీనములోనికి వస్తుంది. అందువల్ల క్రింది ప్రవృత్తుల వికృతచర్యలాగిపోతుంది. కావున ఉన్నత కేంద్రాలు, దైవీ కేంద్రంయొక్క పరిధిలోనికి వస్తాయి. ఈ విధంగా సంపూర్ణంగా మానవుని అస్తిత్వము దైవీకృతమైతుంది. 

 

వారు తమ గురువుగారి పేరిట, 1945 మార్చి 31న షాజహన్‌పూర్ (ఉ.ప్ర.)లో శ్రీ రామచంద్ర మిషన్ స్థాపించిరి. ఇది నెమ్మదిగా సత్యాన్వేషకులను అన్ని ప్రాంతములనుండి ఆకర్షించసాగింది.

 

ప్రకృతియొక్క కార్యము నిర్వహించవలెనన్న ఉద్దేశ్యంతో ఈ భూమిపైనవతరించిన విశిష్ట విభూతి పురుషులు శ్రీ రామచంద్రజి మహారాజుగారు షాజహాన్ పూర్ (ఉ.ప్ర.) తన దైవీప్రేమతో సర్వమానవాళికి సేవనందించారు. అంతేకాక ఆధ్యాత్మిక శిక్షణ లోని నైపుణ్యంతో నిజమైన సత్యాన్వేషకులకు మానవ జీవితపు అంతిమ లక్ష్యాన్ని ప్రసాదించి, ఏప్రిల్ 19,1983న వారు తమ భౌతిక శరీరమును విడిచిపెట్టారు.

 

కానీ, వారు ఇప్పటికి, ఏప్పటికి ఆధ్యాత్మిక జిజ్ఞాసులను చేపట్టి నడిపించుటయేగాక, వారి జీవిత లక్ష్యమైన సత్యవస్తువుయొక్క ప్రాప్తిని ప్రసాదిస్తున్నారు.

bottom of page